ఆర్‌అండ్‌ఆర్ పనులు వేగవంతం చేయాలి ముదిత్‌కుమార్ సింగ్
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ మండలంలోని తాడువాయి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కొనసాగుతున్న పునరావాస పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి నిర్వాసితులకు ఇళ్లను అందించాలని ఎన్‌ఎంసీ అడ్వైజర్ (ఆర్‌అండ్‌ఆర్, పోలవరం) ముదిత్‌కుమార్ సింగ్ సూచించారు. బుధవారం కాలనీని ఆయన పరిశీలించి అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు.కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అన్ని లేఅవుట్లలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ శాఖ సమన్వయంతో విస్తృతంగా మొక్కలు నాటాలని, పాఠశాల ప్రహరీ గోడ లెవెలింగ్, సైకిల్ స్టాండ్, అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రతి ఇంటిని పరిశీలించి వంటగదుల్లో గాలి, వెలుతురు కోసం కిటికీలు ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదారులు సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, ల్యాబ్ టెస్ట్ సెంటర్ పనులను కూడా పరిశీలించారు. జిల్లాలోని మిగిలిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లోనూ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్, సూపరింటెండింగ్ ఇంజనీర్ సి.జయరామాచారి, హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్, ఈఈలు, డీఈఈలు, ఆర్‌అండ్‌ఆర్ అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా