ఆడబిడ్డలకు అండగా రవాణా శాఖ అధికారి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆపదలో ఉన్న ఆడబిడ్డలకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన పిచ్చిక నాగ సత్యనారాయణ ఈ ఏడాది జూన్ 19న పక్షవాతంతో మృతి చెందారు. ఆయన భార్య సత్యవతి మానసిక దివ్యాంగురాలు కావడంతో ముగ్గురు ఆడబిడ్డల కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. ఈ పరిస్థితిని గుర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు పి-4 పథకం కింద ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ముగ్గురు ఆడబిడ్డలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. అంతేకాకుండా మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఇద్దరు బాలికలు జ్యోతిక, జ్యోత్స్నలకు నెలకు ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం మంజూరయ్యేలా కృషి చేశారు.మానసిక దివ్యాంగురాలైన తల్లి సత్యవతిని పరామర్శించి, అవసరమైన మందులను అందజేశారు. మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. బాలికలతో ఆప్యాయంగా మాట్లాడుతూ బాగా చదువుకోవాలని, తండ్రి లేని లోటు తెలియకుండా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి సేవాభావం చాటిన జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావును గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ వైద్యుడు కోట సత్తిరాజు, గోళ్ల ప్రకాష్, కొంకి వెంకట్రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు