2029 నాటికి వైఎస్సార్‌సీపీని జీరో చేస్తాం:ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్ : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాచమల్లు వ్యవహారశైలి, వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బలహీనపరుస్తామని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల విషయంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించింది రాచమల్లేనని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్లపై చేయి వేసే ధైర్యం రాచమల్లుకు ఉందా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ప్రజలు ఇప్పటికే రాచమల్లును తిరస్కరించారని, ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. జగనన్న కాలనీల్లో ప్రజలకు సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగిందని, రాచమల్లు, ఆయన బావమరిది కలిసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఎమ్మెల్యే ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రజలకు తిరిగి పంచాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రజలతో కలిసి రాచమల్లు ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా వరదరాజుల రెడ్డి విమర్శలు చేశారు. సొంత కుటుంబ సభ్యుల వివాహాన్ని అడ్డుకుంటున్నారని జగన్‌పై ఆరోపణలు చేశారు. పులివెందుల ప్రాంతంలోనూ వైఎస్సార్‌సీపీకి నామినేషన్లు వేసే పరిస్థితి లేదని విమర్శిస్తూ, అక్కడి ఎన్నికల పరిణామాలను ప్రస్తావించారు. ప్రొద్దుటూరు మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాచమల్లు చేయి వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో సంయమనం పాటించాలని, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మణ్, టీడీపీ మండల నాయకులు శంకరాపురం ప్రసాద్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ప్రతాప్, ప్రొద్దుటూరు అర్బన్, కడప జిల్లా.