|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 07:45 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా లాభాలతో ముగిశాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు జరగడంతో పాటు ఆటో, ఎనర్జీ షేర్లు కూడా రాణించడంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 82,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 25,285 వద్ద ముగిసింది.ఈ ఉదయం ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు నష్టపోయి 82,075 వద్ద మొదలైంది. అయితే, కొద్దిసేపటికే కోలుకుని ఇంట్రాడేలో 579 పాయింట్ల వరకు లాభపడి 82,654 గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్ సమయంలో 25,331 గరిష్ఠాన్ని నమోదు చేసింది.సెన్సెక్స్ ప్రధాన షేర్లలో ఎస్‌బీఐ 2 శాతానికి పైగా లాభపడగా, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు, టాటా స్టీల్ 1.5 శాతం నష్టపోగా, రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత టీసీఎస్ షేరు సుమారు 1 శాతం క్షీణించింది.