|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 03:56 PM
ఎసైన్డ్ భూముల కబ్జా అనేది తెలంగాణలో ఒక పెద్ద సమస్యగా మారింది. ఎక్కడో ఒక దగ్గర పెద్దల అండల ప్రోద్భలంతో ప్రభుత్వ భూములను స్వాహా చేసేస్తున్నారు. దొరికితే దొంగ.. లేకపోతే దొర అన్న చందంలో ఈ వ్యవహారం సాగుతోంది. ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒక్కసారిగా విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని మంఖాల్ రెవెన్యూ పరిధిలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా చేపట్టిన చర్యలతో.. సుమారు రూ. 300 కోట్ల విలువైన 24.12 ఎకరాల ఎసైన్డ్ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 68, 70, 71, 73, 85, 86లలో ఉన్న ప్రభుత్వ భూములను వర్టెక్స్ కేఎల్లార్ డెవలపర్స్ అనే సంస్థ తమ వెంచర్‌లోకి కలుపుకుంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఏడీ శ్రీనివాస్, డీఐ కృష్ణయ్య వంటి అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ భూములను గుర్తించి.. వాటికి హద్దులు ఏర్పాటు చేశారు. ఇలాంటి కబ్జాలు శంషాబాద్ ప్రాంతానికే పరిమితం కాలేదు. గతంలో కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. నగర శివార్లలో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిరుపేదలకు పంపిణీ చేసిన భూములను పెద్ద సంస్థలు, లేదా రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఆక్రమించుకున్నట్లు అనేక కేసులు నమోదయ్యాయి.
ఎసైన్డ్ భూములను పేదలకు వ్యవసాయం, జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో ఈ భూముల రికార్డులు సరిగా లేకపోవడం, లేదా స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు వీటిని సులభంగా కబ్జా చేస్తున్నారు. కబ్జా అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది ఒక సవాలుగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ధరణి పోర్టల్ ద్వారా భూముల రికార్డులను పారదర్శకంగా చేయడానికి ప్రయత్నించినా, కొన్ని లోపాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులదే. ఒకవేళ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపితే, ఈ సమస్య మరింత జటిలం అవుతుంది.