|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 03:22 PM
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు తెలిపారు. ఈ క్రమంలో చెరువుల పునరుద్ధరణను పెద్దయెత్తున చేపడుతున్నామన్నారు. పర్యావరణ హితమైన నగరాల అభివృద్ధిని కాంక్షిస్తూ ``బయోఫిలిక్ అర్బనిజం వైపు అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు`` పేరుతో శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఏర్పాటు చేసిన దక్షిణమండలి సమావేశంలో హైడ్రా ఉద్దేశాలను కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు వివరించారు. నగరంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి.. వరదల నివారణతో పాటు.. పర్యావరణ హితమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈక్రమంలో చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించడంతో పాటు.. విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రధాన కర్తవ్యం అయినా.. వీటిని నివారించే క్రమంలో చెరువుల పునరుద్ధరణ, కాలుష్య నివారణ అంశాలపై దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే 500ల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం, పార్కులను పునరుద్ధరించాం.. నగరంలో ఉన్న చెరువులన్నిటినీ పర్యావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్ ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.