|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 02:56 PM
అరకొర సౌకర్యాల నడుమ కాళేశ్వరంలో (సరస్వతీ పుష్కరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. సోమవారం సందర్భంగా కాళేశ్వర క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలకు పూజలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తేశ్వరుడు, శుభానంద దేవిని దర్శించుకునేందుకు బారులు తీరారు. రద్దీకి తగినవిధంగా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులు తప్పడంలేదు. పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు చేయడానికి, దుస్తులు మార్చుకోవడానికి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దర్శనాలకోసం క్యూలైన్లలో భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు.కాళేశ్వరంలో సర్వస్వతీ పుష్కరాల నిర్వహణ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధర్మదర్శనం కోసం నిలబడిన భక్తుల క్యూలైన్ ఎంతకూ కదలకపోవడం.. అధికారి పార్టీ నాయకులు తమ అనుచరులు, బంధువులకు నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం కల్పించడం వంటి చర్యలతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సహనం నశించిన భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్‌లో నుంచి బయటికి వచ్చి తోసుకుంటూ ప్రధాన ద్వారం ద్వారా గర్భగుడిలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు మిగిలిన వారిని అడ్డుకుని క్యూలైన్ ద్వారా పంపారు. తోపులాటలో పలువురు చిన్నారులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు.