విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు, ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్యా ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి
సూర్యాపేట: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్, సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు బాధ్యతాయు తంగా పర్యవేక్షించాలని, సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
విద్యార్థులు, సిబ్బంది హాజరుపై రోజువారీ పర్యవేక్షణ
వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. హాజరు వివరాలను సంస్థల వారీగా సేకరించి, ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు కలెక్టరేట్లోని పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (PMS) బృందానికి నివేదించాలని ఆదేశించారు. హాజరు నమోదు వ్యవస్థలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అన్ని సంబంధిత సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు
జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో వసతి గృహాలు, గురుకులాల్లో తాగునీరు, వంట, పాత్రల శుభ్రత, స్నానం, మరుగుదొడ్లు, దుస్తుల ఉతుకుడు తదితర అవసరాలకు సరిపడా నీటి లభ్యత ఉండేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థలో నీటి వనరులు, రోజువారీ అవసరాలు, నీటి శుద్ధి సదుపాయాలు, నీటి నాణ్యత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అవసరమైన మరమ్మతులు, అంచనా వ్యయాల వివరాలను నమోదు చేయాలని సూచించారు.
సంస్థల వారీగా నీటి అవసరాల వివరాలను మూడు రోజుల్లో సమర్పించాలని, సంబంధిత శాఖలు వాటిని సమీకరించి నవంబర్ 4వ తేదీలోగా సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. నీటి వనరుల కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వంటశాలలు
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలని కలెక్టర్ సూచించారు. వంటశాలల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వలు, మెనూ అమలు, అవసరమైన రిజిస్టర్లను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని తెలిపారు. పాలు, పెరుగు తదితర పదార్థాల సరఫరాలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత కొనుగోలు విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. డైట్ బిల్లుల చెల్లింపులో ఉన్న పెండింగ్ సమస్యలను గుర్తించి, సంబంధిత వివరాలతో నివేదించాలని సూచించారు.
పారిశుద్ధ్యం, భవనాల మరమ్మతులకు ప్రాధాన్యత
వసతి గృహాలు, గురుకులాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్ సదుపాయాలు, నీటి పైపులైన్లు, వంటశాలలు, ఇతర మౌలిక వసతులను తనిఖీ చేసి, లోపాలను వెంటనే సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భవనాల్లో పెండింగ్‌లో ఉన్న మరమ్మతులు, ఇతర పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిబంధనల ప్రకారం పనులను చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అద్దె భవనాలకు సంబంధించిన మరమ్మతులు, అద్దె బకాయిలు, ఇతర సమస్యలపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని తెలిపారు.
విద్యార్థులకు ప్రశాంతమైన అధ్యయన వాతావరణం కల్పించేందుకు ప్రతి వసతి గృహం, రెసిడెన్షియల్ పాఠశాలలో రీడింగ్ రూమ్ లేదా రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ప్రతి విద్యార్థికి ఆరోగ్య ప్రొఫైల్
వసతి గృహాలు, గురుకులాల్లోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆరోగ్య వివరాల నమోదు నమూనాను రూపొందించాలని, వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు, తదుపరి పర్యవేక్షణ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా కౌమార దశలోని బాలికల్లో రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల హాజరు, ఉదయం–సాయంత్రం అధ్యయన సమయాలు, పరీక్షల ఫలితాలు, విద్యా ప్రగతిని విద్యార్థుల వారీగా నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA), సమ్మేటివ్ అసెస్మెంట్ (SA), బేస్‌లైన్ పరీక్షల ఫలితాలను సమీకరించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన, పునశ్చరణ తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పదో తరగతి, అవసరమైన చోట ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసి, వాటి అమలును అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
విద్యార్థులకు అందాల్సిన సదుపాయాలు, బకాయిలపై సమీక్ష
విద్యార్థులకు యూనిఫారాలు, నిర్దేశించిన 22 రకాల వస్తువులు/యంగ్ ఇండియా కిట్ల పంపిణీలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, ట్యూటర్ల పారితోషికాలు, పార్ట్‌టైమ్ సిబ్బంది వేతనాలు, ఇతర పెండింగ్ బిల్లుల వివరాలను సంస్థల వారీగా సేకరించి, బిల్లు/టోకెన్ నంబర్లతో సహా సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.
శాఖల వారీగా సమర్పించే నివేదికలు స్పష్టంగా, పూర్తి వివరాలతో ఉండాలని, మౌలిక వసతుల పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరంగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
నవంబర్ 5న క్షేత్రస్థాయి సమీక్ష
వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల పనితీరుపై నవంబర్ 5వ తేదీన సమగ్ర క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షలో విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, ఆహార సరఫరా, ఆరోగ్య వివరాలు, విద్యా ఫలితాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, పెండింగ్ సమస్యలను సంస్థల వారీగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, విద్యా ప్రగతి విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించా లని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్ డి ఎస్ సి డి ఓ లతా ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ రవితేజ అనుష ఆర్సిఓ లు తదితరు జిల్లా అధికారులు పాల్గొన్నారు