ఉద్యోగం పేరుతో నమ్మించి.. రహస్య కెమెరాలతో బ్లాక్‌మెయిల్.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళను మోసం చేయడమే కాకుండా, రహస్య కెమెరాలతో ఆమె వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది. బాధితురాలిని బెదిరించి రూ.8 లక్షల నగదు, మొత్తం 22 తులాల బంగారం కాజేయడంతోపాటు, మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు దివ్య, హరి, ప్రశాంత్‌లపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాధితురాలికి తన నివాస భవనంలోని బీ-104 ఫ్లాట్‌లో ఉండే దివ్యతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం కావాలని ఆమె చెప్పడంతో, తన భర్త హరి డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నాడని, ఉద్యోగం ఇప్పిస్తాడని దివ్య నమ్మించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ పేరుతో తరచూ బాధితురాలి ఇంటికి వచ్చిన హరి, ఆమె ఫోన్ నంబర్‌ను తీసుకుని ప్రశాంత్ అనే వ్యక్తిని ఓ ప్రముఖ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్‌గా పరిచయం చేసినట్లు తెలిపింది. వీరి సహకారంతో బాధితురాలు ఆ సంస్థలో చేరినట్లు వెల్లడించింది.ఈ క్రమంలో హరి, ప్రశాంత్ కలిసి బాధితురాలి ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చి ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం హరి తండ్రి ఆరోగ్యం బాగోలేదని డబ్బులు కావాలంటూ దివ్య అడగగా, తన వద్ద డబ్బులు లేవని బాధితురాలు చెప్పింది. దీంతో ఆమె వ్యక్తిగత ఫొటోలు, బాత్రూమ్ వీడియోలు, వాట్సాప్ సందేశాలను భర్తకు చూపిస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ బెదిరింపులకు భయపడి బాధితురాలు 16 తులాల బంగారాన్ని ఇవ్వగా, దానిని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి నిందితులు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత ప్రశాంత్ కూడా వారితో చేరి ముగ్గురూ కలిసి బాధితురాలిని బెదిరిస్తూ రూ.8 లక్షల నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రశాంత్ బాధితురాలి నుంచి మరో ఆరు తులాల బంగారు నెక్లెస్ తీసుకుని ఐఐఎఫ్ఎల్‌లో తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మొత్తం 22 తులాల బంగారంతోపాటు నగదును తీసుకున్నప్పటికీ, నిందితులు బాధితురాలిని వేధించడం ఆపలేదని సమాచారం.ఈ ఏడాది జూన్ 8న బంగారం తిరిగి ఇస్తానని చెప్పి దివ్య బాధితురాలిని తన ఫ్లాట్‌కు పిలిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో బాధితురాలు స్పృహ కోల్పోయిందని, ఆ సమయంలో హరి, ప్రశాంత్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం దాడికి సంబంధించిన వీడియోలను దివ్య బాధితురాలి ఫోన్‌కు పంపి మరోసారి బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. నిందితుల వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.ఈ కేసుకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ నుంచి అధికార పరిధి ఆధారంగా కేసు డైరీ (సీడీ) ఫైల్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు దివ్య, హరి, ప్రశాంత్‌లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 70(1), 351(2), 45 కింద క్రైం నంబర్ 891/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.