మధ్యాహ్నం వరకు బయటకు రావద్దు
మధ్యాహ్నం వరకు ప్రజలు బయటకు రావద్దు......
అమలాపురం మేజర్ న్యూస్ అర్నబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సహాయక, పునరుద్ధరణ చర్యలను ముమ్మరం చేశారని పేర్కొన్నారు. రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం, విద్యుత్ స్తంభాల సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వరకు ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రహదారులపై పడిపోయిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు ప్రజలు అధికారులకు సహకరించాలని, తమ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.