ఆలూర్ గ్రామానికి మరో నాలుగు హైమాస్ట్ లైట్లు మంజూరు
చేవెళ్ల : గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ, ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించి ఆలూర్ గ్రామానికి అదనంగా మరో నాలుగు హైమాస్ట్ లైట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 30వ తేదీన ఆలూర్ గ్రామంలో జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆహ్వానించిన సందర్భంగా, గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు. ఈ క్రమంలో ఆలూర్ గ్రామానికి ఇప్పటికే రెండు హైమాస్ట్ లైట్లు మంజూరైనప్పటికీ, గ్రామం పెద్దది కావడంతో అవి సరిపోవడం లేదని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు హైమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
గ్రామ ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య, అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ల కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆలూర్ గ్రామానికి అదనంగా మరో నాలుగు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు కాంట్రాక్టర్ కూడా అంగీకరించారు. అంతేకాకుండా, గురువారం గ్రామానికి వచ్చి హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, నాలుగు హైమాస్ట్ పోల్స్‌తో పాటు లైట్ల ఏర్పాటు పనులు చేపట్టేలా తన ఎలక్ట్రీషియన్‌కు సూచించారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ అదనంగా మరో నాలుగు హైమాస్ట్ పోల్స్, లైట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు ఆలూర్ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సహకారం అందించి, ఆలూర్ గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.