అర్నబ్' విలయతాండవం: ఉత్తరాంధ్రలో రికార్డు స్థాయి వర్షపాతం..
'విశాఖపట్నం మేజర్ న్యూస్ :‘అర్నబ్’ పెను తుఫాను ఉధృతికి ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం అనకాపల్లి జిల్లా కశింకోటలో అత్యధికంగా 26.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, పరవాడలో 24.7 సెం.మీ, యలమంచిలిలో 24 సెం.మీ, అచ్యుతాపురంలో 23.9 సెం.మీ మేర వర్షం పడింది. మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురంలో 26.2 సెం.మీ, వేపాడలో 23.6 సెం.మీ వర్షపాతం రికార్డవ్వగా, విశాఖపట్నం నగరంలో 26 సెం.మీ, పెందుర్తిలో 24.2 సెం.మీ, సింహాచలం ప్రాంతంలో 23.7 సెం.మీ చొప్పున కుండపోత వర్షం కురిసింది.
ఈ భారీ వర్షాల ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లుతూ రహదారులపైకి మోకాళ్ళ లోతు నీరు చేరింది. మరోవైపు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలడంతో విద్యుత్ మరియు రవాణా వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు రెస్క్యూ చర్యలు ముమ్మరం చేశాయి.