తుఫాన్ బీభత్సం.. అంధకారంలో దివిసీమ ఎడతెరిపిలేని వర్షంతో జలమయమైన రహదారులు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేత.. ప్రజలకు తప్పని ఇబ్బందులు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో దివిసీమలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ఈదురుగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాంతమంతా అంధకారంలో మగ్గుతోంది.
బుధవారం ఉదయం 11 గంటలు దాటినా వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇళ్లలో పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు సెల్‌ఫోన్లలో చార్జింగ్ అయిపోతుండటంతో అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో జనజీవనం స్తంభించగా, వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.