2K రన్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ప్రజల క్షేమం, రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, పోలీసుల సేవలు, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమేనన్నారు.ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాలను గౌరవించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ఈ 2కె రన్ లో డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు,సిఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్,ఆర్.ఐ మధుకర్, ఎస్.ఐ లు , విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, వాకర్స్ పాల్గొన్నారు.