హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్- హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం
- కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం క్రైమ్,(సూర్య)
భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు టెక్నికల్ టీమ్ సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించినట్లు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం బస్‌స్టాండ్ సమీపంలో నిందితులు దంత్యాల గణేష్ అలియాస్ గని, సిరిపురం సాత్విక్ అలియాస్ చిన్సు, ముద్దంగుల వెంకటేష్ అలియాస్ చిన్ని, తరాల ప్రదీప్‌లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, గతంలో జరిగిన గొడవలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న గణేష్, సాత్విక్‌లు అఖిల్‌పై పగ పెంచుకొని హత్యకు పథకం రచించారు. ఇందులో భాగంగా మద్యం తాగిస్తామని నమ్మించి అఖిల్‌ను ఎదురుగడ్డ గ్రామంలోని రేకుల షెడ్డు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో గణేష్ కత్తితో అఖిల్ మెడపై పలుమార్లు పొడిచి, సిమెంట్ ఇటుకతో ముఖంపై దాడి చేయగా, సాత్విక్ కూడా సిమెంట్ ఇటుకతో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో అఖిల్ మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి మిగిలిన నిందితులు సైతం ముందస్తు పథకంలో భాగంగా సహకరించినట్లు, మద్యం కొనుగోలు తదితర అవసరాల కోసం ఫోన్‌పే ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఫోన్‌పే లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకొని, తదితర ఆధారాలకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షలు, పాత గొడవల కారణంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకొని నేరాలకు పాల్పడవద్దని, సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతకాలం పరారీలో ఉన్నా సాంకేతిక ఆధారాలు, పోలీసుల దర్యాప్తు ద్వారా గుర్తించి చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో టెక్నికల్ టీమ్ సహకారం కీలకంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.