ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం..
ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ పోరుబాట
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ : కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల విక్రయ ప్రతిపాదనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, వాటిని విక్రయించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడం సరైన నిర్ణయం కాదని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నగరంలో ఇప్పటికే ప్రజా అవసరాలకు అనుగుణంగా స్థలాల కొరత ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన భూములను ఆదాయ వనరుగా చూడటం తగదని విమర్శించారు. ట్రక్ పార్క్ భూముల విక్రయ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే పునఃపరిశీలించి, అమ్మకాలను నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులుగా భావించాల్సిన ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.