నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్
అన్ని సర్కిళ్లలో సమన్వయంతో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):నగరంలోని ప్రజా రద్దీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగుతోంది. నాలుగు వారాలపాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం నగరంలోని వివిధ సర్కిళ్లు, జోన్ల పరిధిలో పారిశుధ్య సిబ్బంది విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టారు. ప్రధానంగా బస్‌స్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు
తార్నాక సర్కిల్-43 పరిధిలో తార్నాక బస్‌స్టాప్, ఆర్టీసీ ఆసుపత్రి బస్‌స్టాప్, టీఎస్‌ఆర్టీసీ ఆసుపత్రి, నామాలగుండు, చిలకలగూడ బస్‌స్టాప్‌లతో పాటు బౌద్ధనగర్ వార్డు కార్యాలయ ప్రాంగణంలో శుభ్రత పనులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో మెట్రో స్టేషన్ల కింద, బస్‌స్టాప్‌ల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ పనుల్లో డీఈఈ, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
చంద్రాయణగుట్ట సర్కిల్-23లోని బర్కాస్ యూపీహెచ్‌సీ, సుబ్రమణ్యం కాలనీ వార్డు కార్యాలయ ప్రాంగణాలను శుభ్రం చేశారు. కావడిగూడ సర్కిల్-40, ముషీరాబాద్ సర్కిల్-41 పరిధిలోని బస్‌స్టాండ్‌లు, ఆసుపత్రులు, పాఠశాలల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు.
అత్తాపూర్ సర్కిల్-20లో డీఈఈ పర్యవేక్షణలో బస్‌స్టాండ్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బుద్వేల్ రైల్వే స్టేషన్‌లో శుభ్రత పనులు చేపట్టారు. మసబ్ ట్యాంక్ సర్కిల్-34 పరిధిలోని మెహదీపట్నం బస్‌స్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద, సంతోష్‌నగర్ సర్కిల్-25 పరిధిలోని బస్‌స్టాప్‌ల వద్ద కూడా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
180 ప్రాంతాల్లో శుభ్రత.. 26 టన్నుల చెత్త తొలగింపు
ఐదో రోజు నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా మొత్తం 180 ప్రజా సేవా కేంద్రాలను శుభ్రపరిచారు. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన 26 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చారు.
నిరంతర పారిశుధ్య నిర్వహణకు చర్యలు
నగరంలోని అన్ని సర్కిళ్లు, జోన్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. ప్రజా ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.