తండ్రి ఆఖరి కోరిక తీర్చిన చిన్నారి... కన్నీటితో వీడ్కోలు
తండ్రి చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె బిందుశ్ర
విజయదశమి వేళ పెనుబల్లిలో హృదయ విదారక ఘట
పెనుబల్లి, సూర్య మేజర్ న్యూస్:
ముక్కుపచ్చలారని ఓ చిన్నారి తన తండ్రి ఆఖరి కోరికను నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ చిన్నారి కన్న తండ్రి చివరి కోరిక మేరకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కన్నీళ్లను దిగమింగుకుంటూ కన్నతండ్రికి కడసారి వీడ్కోలు పలికిన ఆ దృశ్యం అక్కడున్న వారందరి హృదయాలను కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన పెనుబల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
*అనారోగ్యంతో కన్నుమూసిన వంశీ*
పెనుబల్లి గ్రామానికి చెందిన వంగా వంశీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయదశమి పండుగ రోజునే తుదిశ్వాస విడిచారు. పండుగ వేళ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం బంధుమిత్రులను, గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
*కుమార్తె చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు*
తాను మరణించిన అనంతరం తన పెద్ద కుమార్తె బిందుశ్రీయే తలకొరివి పెట్టాలని వంశీ జీవించి ఉన్నప్పుడే తన చివరి కోరికను వ్యక్తం చేశారు. తండ్రి ఆఖరి మాటను గౌరవించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన కోరికగా పెద్ద కుమార్తె చేతుల మీదుగానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కన్నతండ్రి ఇక తిరిగిరాడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక బిందుశ్రీ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తండ్రి చితికి నిప్పంటించింది. తండ్రికి కడసారి వీడ్కోలు పలుకుతున్న ఆ చిన్నారి దీనస్థితిని చూసి తండ్రి ప్రేమానురాగాలకు దూరమైన చిన్నారి పరిస్థితి ప్రతి ఒక్కరినీ కలచివేసింది. చివరి కోరికను నెరవేర్చిన బిందు శ్రీ ధైర్యం తండ్రిపై ఆమెకున్న ప్రేమను చూసి గ్రామస్తులు బావోద్వేగానికి గురయ్యారు. తండ్రి ఆఖరి కోరికగా బిందుశ్రీ అంతిమ అంతిమసంస్కారాలు జరిపి చితికి నిప్పు పెట్టి కన్నీటి వీడ్కోలు పలికింది.