భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ
*నారాయణపేట, సూర్యన్యూస్:* నారాయణపేట జిల్లా కేంద్రంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలకు బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. అశోక్ నగర్ భజరంగ్ దళ్, సరఫ్ బజార్ బసవేశ్వర దేవాలయం, రజక సంఘం, మడి, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లోని అమ్మవారి విగ్రహాలతో అలంకరించిన వాహనాలు, భక్తుల జయజయధ్వానాలు, భక్తి గీతాలు, మంగళవాయిద్యాలతో పట్టణ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దుర్గామాత నామస్మరణతో ప్రధాన వీధులు మార్మోగాయి. యువత భక్తి పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
*సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి*
మహిళలు చీరలు, ఇతర సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ఊరేగింపులో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. దుర్గామాత ఊరేగింపు, బతుకమ్మ సందడి కలగలిసి పండుగ వాతావరణాన్ని మరింత వైభవంగా మార్చాయి.
*భక్తులతో కిక్కిరిసిన వీధులు..*
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో పట్టణంలో సందడి నెలకొంది. భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా శోభాయాత్ర సాగింది. నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారికి భక్తులు భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతూ, వచ్చే ఏడాది మళ్లీ తమ ప్రాంతాలకు విచ్చేసి ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.