సికింద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్‌లోని ఒక భవనం మూడవ అంతస్తులో ఉన్న మెడికల్ గోదాములో ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగాయి. గోదాము నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గోదాములో ఉన్న మెడికల్ సామగ్రి, మందులు కాలి బూడిదయ్యే ప్రమాదం ఉంది. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.