రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
నవాబుపేట సూర్య న్యూస్:రోడ్డు ప్రమాదం ఓ నిరుపేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.చేతికొచ్చిన కొడుకు అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.ఈ విషాద ఘటన మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల అభిలాష్ విషయంలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు,గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..అభిలాష్(19)అనే యువకుడు శుక్రవారం తన సొంత పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు.ఈ క్రమంలో ధర్పల్లి గ్రామ శివారులోని మొరంబాయి వద్ద ఎదురుగా వస్తున్న జేసీబీని అతని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో అభిలాష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.*ఆధారం లేని కుటుంబం..* నాలుగు సభ్యులున్న అభిలాష్ కుటుంబంలో తండ్రి 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు.అప్పటి నుంచి తల్లి,కుమార్తె,అభిలాష్‌తో కుటుంబం కొనసాగుతోంది.కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న కొడుకు అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో తల్లి దిక్కుతోచని స్థితిలో విలపిస్తోంది.ఆమె రోదనలు చూసి గ్రామస్థులు సైతం కంటతడి పెడుతున్నారు.ఇప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు అండగా ఉన్న కొడుకును కూడా కోల్పోవడంతో దిక్కులేనిదిగా మారింది.నిరుపేద కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు,ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు.