యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్
కుషాయిగూడ. నవంబర్ 6 మేజర్ న్యూస్ .చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 వేల పరిశ్రమలు ఉండగా, లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చదువులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్న యువతకు పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించాలని సూచించారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నషా ముక్త్ భారత్ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ పేరుతో చర్యలు చేపడుతున్నప్పటికీ మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. పాఠశాలలు, కళాశాలల్లోనూ మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పూర్తి మద్దతు అందిస్తోందని, ఈ నేపథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఈటల రాజేందర్ సూచించారు.