telangana
రాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!
సూర్య, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలంలోని సూరారం రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సూరారం గ్రామానికి చెందిన చెల్లా చరణ్ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి చరణ్ తన అన్న జస్వంత్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సమీపంలోని హనుమాన్ దేవాలయం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్షెట్టిపేట వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చరణ్ రోడ్డుపక్కన ఉన్న చెట్ల పొదల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న అన్న జస్వంత్, సిద్ధార్థ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.మృతుడి తండ్రి చల్ల రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.