రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే కొనసాగించాలి
రామాయంపేట;రామాయంపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రామాయంపేట ప్రజల ఆకాంక్షను, రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను గుర్తించి రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా జాప్యం చేస్తూ ప్రజల డిమాండ్‌ను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.ఈ నేపథ్యంలో సోమవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఆవశ్యకతను అధికారులకు వివరించి, వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.రామాయంపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడితే పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని, ప్రభుత్వ కార్యాలయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ప్రజల భాగస్వామ్యంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సొసైటీ చైర్మన్ బాదే చంద్రం మాజీ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టి యాదగిరి కౌన్సిలర్ కుక్క ప్రవీణ్ అస్నుద్దిన్ ఎస్.కె అహ్మద్ దోమకొండ శ్రీనివాస్ సరాఫ్ శ్యామ్ మల్యాల కిషన్ విద్యాకర్ వినయ్ సాగర్ నవీన్ తో పాటు బి ఆర్ ఎస్ నాయకులుతదితరులు పాల్గొన్నారు