నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం
రామాయంపేట;నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా అన్నారు. ప్రతి కుటుంబానికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం ఒకటో వార్డు ఎస్సీ కాలనీ, నాలుగో వార్డు రైతు వేదిక, రెండో వార్డు కోమటిపల్లి ప్రాంతాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పథకం వివరాలు, అర్హతలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు జీవిత బీమా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇలాంటి బీమా పథకాలు భరోసా కల్పిస్తాయని అన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానికి ఈ బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.అర్హత కలిగిన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పథకానికి సంబంధించిన వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు తమ పరిధిలోని అర్హులైన కుటుంబాలకు కూడా తెలియజేయాలని కోరారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే ఇలాంటి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్ లు గజవాడ నాగరాజు గుప్త, దేవుని, రంజిత్, రవి నాయక్, బైరం స్వప్న కుమార్, కొక్కు ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ ఏ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచమ్మల గణేష్, బైరంకుమార్, డాకి స్వామి, చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.