ప్రగతి నగర్ పాఠశాల స్థల పరిరక్షణకు కాంగ్రెస్ అండ..
*పాఠశాల స్థలంలోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వం : నర్సారెడ్డి భూపతిరెడ్డి*
దుండిగల్ మేజర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలానికి సంబంధించి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి, పాఠశాల భూమిని పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థలం విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాఠశాలకు సంబంధించిన స్థలంలో ఎవరూ అడుగుపెట్టడానికి వీలులేదని, పాఠశాల భూమిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి పాఠశాల స్థలానికి సంబంధించి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల భూమికి పూర్తి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)ను కలిసి పాఠశాల స్థల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పాఠశాల భూమి విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.