సూర్య, కాగజ్‌నగర్:పండగ వేళ కుటుంబాలతో సంతోషంగా గడపాల్సిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు, పీఎఫ్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ రక్షణ సేన సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబితా మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో జీతాలు, పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే కార్మికులు పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. అధికారులు కార్మికుల ఆవేదనను పట్టించుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కుటుంబాలతో పండగను ఆనందంగా జరుపుకోవాల్సిన సమయంలో జీతాల కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.కార్మికులకు వెంటనే బకాయి జీతాలు, పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే కార్మికులకు అండగా తెలంగాణ రక్షణ సేన తరఫున ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.