అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు..
అంబాజీపేట, మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల పరిషత్ (ఎంపీపీ) పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కూటమిలో టికెట్ రాజకీయం వేడెక్కింది. టీడీపీ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సహకార రంగ సేవలు ఉన్న గణపతి అనంత తులసి వీరరాఘవులు బరిలో నిలవగా.. జనసేన నుంచి రికార్డు స్థాయి అభివృద్ధితో మాచవరాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ సుంకర సత్యవేణి - బాలాజీ దంపతులు పోటీపడుతున్నారు. ఈ ఇద్దరిలో కూటమి అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనే అంశం ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పార్టీ అనుభవం, రైతు సేవలతో టీడీపీ రేసులో..
తెలుగుదేశం పార్టీ తరఫున గణపతి అనంత తులసి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె భర్త గణపతి వీరరాఘవులు 1983 నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్‌గా (2014-19), అంబాజీపేట సొసైటీ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు (2005-19) సేవలు అందించడమే కాకుండా, ఉత్తమ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం, ఐఎఫ్‌ఎఫ్‌సీవో (IFFCO) అవార్డులు అందుకున్నారు.
అలాగే 2017లో కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొబ్బరి పీచు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రైతులకు విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తూ 2022లో ఉత్తమ ఎఫ్‌పీసీ (FPC) అవార్డును సాధించారు. ప్రస్తుతం క్లస్టర్ ఇన్‌చార్జిగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ, టీడీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.
అభివృద్ధే అజెండాగా జనసేన నుంచి సుంకర సత్యవేణి..
మరోవైపు జనసేన పార్టీ నుంచి మాజీ సర్పంచ్ సుంకర సత్యవేణి - బాలాజీ దంపతులు రేసులో ఉన్నారు. గృహిణిగా రాజకీయాల్లోకి వచ్చి మాచవరం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, తన పదవీ కాలంలో సుమారు రూ.25 కోట్లతో గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారు. పంచాయతీ భవన నిర్మాణం, రూ.7.50 కోట్లతో మంచినీటి పథకం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త తరలింపు ట్రాక్టర్ల కొనుగోలు, మరుగుదొడ్ల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆర్ అండ్ బి రోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి ఉన్న రూ.63 లక్షల లోటు బడ్జెట్‌ను అధిగమించి, శానిటరీ సిబ్బంది వేతనాలు పెంచి స్వచ్ఛ భారత్‌ను విజయవంతంగా అమలు చేయడం ఆమె పాలనా దక్షతకు నిదర్శనంగా నిలిచింది. "మాచవరం అభివృద్ధే నా అనుభవానికి సాక్ష్యం" అంటూ ఆమె మండల పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఉత్కంఠ రేపుతున్న కూటమి రాజకీయం
ఒకవైపు సుదీర్ఘ పార్టీ అనుభవం, రైతు సంక్షేమ సేవలతో టీడీపీ నుంచి గణపతి వీరాఘవులు దంపతులు.. మరోవైపు అద్భుతమైన అభివృద్ధి రికార్డులతో జనసేన నుంచి సుంకర బాలాజీ దంపతులు ఎంపీపీ పీఠం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఇద్దరిలో కూటమి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ పరిణామం కూటమి ఐక్యతకు ఏవిధంగా మలచుకుంటారనే చర్చ ప్రస్తుతం క్యాడర్‌లో జోరుగా సాగుతోంది.