పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం.. సర్పంచ్ ఫోటో లేకపోవడంపై ఆగ్రహం
బషీరాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఫ్లెక్సీలలో స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ మహారాజ్ ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను విస్మరించారంటూ ఆయన వర్గీయులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఫోటో లేకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత అవమానం కాదని, సర్పంచుల వ్యవస్థకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అధికారుల నిర్లక్ష్యమా? లేక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఫోటోను తొలగించారా? అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు తమ రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని సర్పంచుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుండటంతో బషీరాబాద్ మండలంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.