హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : నెలలు నిండకముందే జన్మించిన శిశువులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ వైద్యులు తెలిపారు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం సందర్భంగా నవంబర్ 15 నుంచి 21 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కిమ్స్ కడల్స్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ బాబు ఎస్. మడార్కర్ మాట్లాడుతూ.. ప్రీ మెచ్యూర్ శిశువుల ఎదుగుదల, కంటి చూపు, వినికిడి, మెదడు అభివృద్ధిని క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. కంగారూ మదర్ కేర్, తల్లిపాలు, పోషకాహారం కీలకమన్నారు. నవంబర్ 19న మూడేళ్లలోపు వయస్సున్న, నెలలు నిండకముందే పుట్టిన లేదా రెండు కిలోల కంటే తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు ఉచిత న్యూరో డెవలప్‌మెంటల్, కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించనున్నారు. డాక్టర్ త్రిపుర సుందరి మాట్లాడుతూ.. హైరిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ప్రీ మెచ్యూర్ ప్రసవాల ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.