telangana
పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ వి. రాములు
సూర్య మంచిర్యాల: జిల్లాలో చేపడుతున్న భూముల రీసర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు.బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామాన్ని తహసీల్దార్,డిప్యూటీ తహసీల్దార్,ఉపసర్పంచ్‌లతో కలిసి సందర్శించి రీసర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. రైతులు రీసర్వేకు సహకరించడం అభినందనీయమన్నారు.అనంతరం అంకుశాపూర్ గ్రామంలో నిర్వహించిన రీసర్వే గ్రామసభకు హాజరై పనుల పురోగతిని సమీక్షించారు.రైతుల భాగస్వామ్యంతో రీసర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.తదుపరి జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రీసర్వే,కోర్టు కేసులు,జీఓఎంఎస్ నంబర్ 76,జీఓఎంఎస్ నంబర్ 59,ఎస్‌ఐఆర్ ప్రక్రియ,భూభారతి ఫైళ్లు, మీ-సేవ ద్వారా జారీ చేయాల్సిన ధ్రువపత్రాల పెండింగ్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ రికార్డుల ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.