పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా : మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు కేఎల్ఆర్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ వైద్య చికిత్సకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ సహాయం ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. వైద్య సహాయం అవసరమైన వారు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్