పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు
సూర్య బోథ్ : బోథ్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో పత్తి పంట మధ్య అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై బోథ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, మొత్తం 33 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.3,30,000 ఉంటుందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గంజాయి సాగు చేయడం, వినియోగించడం, విక్రయించడం, అక్రమ రవాణాకు పాల్పడటం చట్టరీత్యా నేరమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దాడుల్లో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.