పారిశుద్ధ్యంపై అధికారుల సమీక్ష.... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ : మియాపూర్ సర్కిల్ ఎస్‌ఎల్‌పీజెడ్ పరిధిలో నేడు పారిశుద్ధ్య నిర్వహణపై డిసి శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈఈ (ఎస్‌డబ్ల్యూఎం), ఏఈఈ (ఎస్‌డబ్ల్యూఎం), ఎస్‌ఆర్‌పీలు, ఎస్‌ఎఫ్‌ఏలు, రాంకీ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు.ముఖ్యంగా QR కోడ్ స్కానింగ్, ధ్రువీకరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను (జీవీపీలు) పూర్తిస్థాయిలో తొలగించాలని సూచించారు. బల్క్ గార్బేజ్ జనరేటర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోస్టర్ రహిత ప్రచారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.అదేవిధంగా 'నో బిన్ – నో ట్రేడ్' విధానాన్ని కఠినంగా అమలు చేయడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని, కొబ్బరి బొండాల విక్రయదారులందరినీ తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సమస్యలను గుర్తించేందుకు పిన్‌పాయింట్ మానిటరింగ్ చేపట్టాలని, గ్యాంగ్ వర్క్, పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ట్రేడ్ లైసెన్స్ నిబంధనలను ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ అంశాలన్నింటిపై సంబంధిత అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సమావేశంలో స్పష్టం చేశారు.