ఎల్ నినో ప్రభావం.. రైతులకు తీరని నష్టం!
వేములపల్లి,మేజర్ న్యూస్ :
వేములపల్లి మండలం అమనగల్లు గ్రామంలో ఎల్ నినో ప్రభావంతో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.వర్షాలు లేక, నీటి కొరతతో పంటలు నిలువునాఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారి కిషోర్ నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేనిర్వహించారు.దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎండిపోయిన పత్తి, వరి పంటలను చూసి నష్టం తీవ్రతను అంచనా వేశారు.ఎంతో వ్యయప్రయా సాలు పడి సాగు చేసిన పంట దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.