నీటి విలువ తెలుసుకోండి.. వేసవి నీటి ఎద్దడిని నివారించండి: ఎంపీడీవో శాంత
మర్పల్లి, మేజర్ న్యూస్: రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఒక్కరూ నీటి నిల్వలను పెంచుకోవాలని మర్పల్లి మండల ఎంపీడీవో శాంత పిలుపునిచ్చారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ప్రతి పొలం వద్ద నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.మండలంలోని పల్లి గ్రామంలో సర్పంచ్ మల్లారెడ్డి, ఉపసర్పంచ్ యాదమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి సంరక్షణ అవగాహన సమావేశంలో ఎంపీడీవో శాంత మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తూ నీటి నిల్వలను పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ శ్రీనివాస్, ఏపీవో అంజిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.