నవంబర్ 26న కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ.. ప్రభుత్వం కీలక ప్రకటన
హైదరాబాద్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా రెండు కీలక సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నేడు (నవంబర్ 19) ప్రారంభం కావాల్సిన కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను అనివార్య కారణాలతో ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 4,63,857 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పెన్షన్ నగదును అదే రోజు నేరుగా జమ చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఇందిరమ్మ చీరల పంపిణీని కూడా విస్తృత స్థాయిలో ప్రారంభించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.