జేపీ మోర్గాన్ వేధింపుల దావా కొట్టివేత అభ్యర్థన తిరస్కరణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: మాజీ ఉద్యోగి చిరాయు రాణా దాఖలు చేసిన వేధింపుల కేసును కొట్టివేయాలంటూ జేపీ మోర్గాన్ చేజ్ చేసిన అభ్యర్థనను అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తిరస్కరించారు. కేసులోని వాదనలు మరియు ఆరోపణల నిజానిజాలను తేల్చాల్సింది కోర్టు విచారణ మరియు జ్యూరీ ద్వారానే తప్ప, ముందుస్తు కొట్టివేత లేదా ప్రచార వ్యూహాల ద్వారా కాదని జడ్జి లూయిస్ కప్లాన్ స్పష్టం చేశారు. బ్యాంకుతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ లోర్నా హజ్దినిపై కూడా ఈ దావా కొనసాగుతుండగా, ఇరుపక్షాలు విచారణకు సిద్ధం కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
2024లో జేపీ మోర్గాన్ లివరేజ్డ్ ఫైనాన్స్ విభాగంలో చేరిన చిరాయు రాణా, ఈ ఏడాది ఏప్రిల్లో సంస్థ మరియు లోర్నా హజ్దినిపై లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలతో దావా వేశారు. అయితే ఈ ఆరోపణలను జేపీ మోర్గాన్ తో పాటు లోర్నా హజ్దిని పూర్తిగా ఖండించారు. అంతేకాకుండా రాణాపై లోర్నా హజ్దిని పరువునష్టం దావా కూడా దాఖలు చేశారు. కేసులో సాక్షుల వాంగ్మూలాలకు సంబంధించి అభ్యంతరాలు తలెత్తిన నేపథ్యంలో, రాణా తప్పుడు సాక్ష్యాలను ప్రోత్సహించారని ఆరోపిస్తూ బ్యాంకు కేసును కొట్టివేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
రాణా సోదరి చాందని రాణా గతంలో ఇచ్చిన వాంగ్మూలంపై వెనక్కి తగ్గుతూ అఫిడవిట్ దాఖలు చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. న్యాయవాదులతో మాట్లాడే సమయంలో తన సోదరుడే తనకు సూచనలు ఇచ్చి, రాతపూర్వక నోట్స్ అందించాడని ఆమె పేర్కొన్నట్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో సాక్ష్యాల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తగా, ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పలువురు న్యాయవాదులు లేదా న్యాయ సంస్థలు కేసు నుంచి వైదొలిగేందుకు పిటిషన్లు దాఖలు చేయడం కూడా గమనార్హం.
అయితే సాక్షుల విశ్వసనీయత మరియు ఎవరు నిజం చెబుతున్నారు అనే అంశాలను విచారణ దశలో జ్యూరీ పరిశీలించి నిర్ణయించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వాణిజ్య, బ్యాంకింగ్ రంగంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో తదుపరి న్యాయ ప్రక్రియ మరియు విచారణ వివరాలపై ఆర్థిక, న్యాయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.