తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించేందుకు సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. కాగా, నిన్న ఒక్కరోజే 77,092 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,615 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.55 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది.