నాన్చుడు ధోరణి ఎందుకుః టీడబ్ల్యూజేఎఫ్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యపు వైఖరిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా తప్పుబట్టింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు నిజాంపేటలో కేటాయించిన 32 ఎకరాల భూమిని పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సీల్ వేయించడం ఏమిటని వారు ప్రశ్నించారు. గత 18 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు చెల్లించి ఇళ్ల స్థలాల కోసం ఇంతకాలం ఎదురుచూస్తున్న జేఎన్జే హౌసింగ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిజాం పేటలో సర్వే నంబర్ 332లో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లో 38 ఎకరాల భూమి కేటాయించారని, ఈ భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు హామీలిచ్చారని వారు గుర్తుచేశారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పలు సందర్భాల్లో జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు నేటికీ సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరించకూడదని వారు హితవు పలికారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటనలకు, హామీలకే పరిమితం కాకుండా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాంపేటలో జేఎన్జే సొసైటీకి కేటాయించిన భూమి విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని సభ్యులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను సమీకరించి చైతన్య యాత్రలు నిర్వహించడంతో పాటు ఇళ్ల స్థలాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ లు హెచ్చరించారు.
ఎ.రవీందర్, హైదరబాద్.