ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు
నల్గొండ జిల్లా కట్టంగూర్:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ఉద్యమకారుడు, నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం కల్మర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారంతో ముగిసింది.
చెరువుగట్టు క్షేత్రం నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వరకు మల్లేష్ తన బృందంతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగిసిన అనంతరం బృంద సభ్యులతో కలిసి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాదయాత్ర సాగిన తీరు, యాత్రలో ఎదురైన అనుభవాలతో పాటు నల్గొండ జిల్లాలోని పలు సమస్యలను కేసీఆర్‌కు వివరించారు.
మల్లేష్ బృందం చేపట్టిన పాదయాత్రను కేసీఆర్ అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా మల్లేష్ చేపట్టిన ఈ యాత్ర పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు.