ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు
సిద్దిపేట, సూర్య ప్రతినిధి :సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి పరిధిలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన భూ సర్వే ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరింది. ఎర్రవల్లి రెవెన్యూ పరిధిలోని 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల భూమికి సంబంధించిన సమగ్ర సర్వే నివేదిక సిద్ధమైంది. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలన జరిపిన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ఈ నివేదికను జిల్లా కలెక్టర్ హైమావతికి గురువారం అందజేశారు.
ఈ 388 ఎకరాల పరిధిలోని భూముల వర్గీకరణ, హద్దులు, ఆక్రమణలు లేదా వ్యత్యాసాల గుర్తింపు లక్ష్యంగా అధికారులు సమగ్రంగా రీ-సర్వే పూర్తి చేసినట్లు సమాచారం. కలెక్టర్ హైమావతి ఈ నివేదికను పరిశీలించిన అనంతరం నేడో, రేపో నివేదికను తుది నిర్ణయం నిమిత్తం ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
కాగా, అధికారులు సిద్ధం చేసిన సర్వే నివేదికలో ఏ ఏ ముఖ్యాంశాలు పొందుపరిచారు? భూ కేటాయింపులు, భూమి స్వభావంపై ఎలాంటి వివరాలు పేర్కొన్నారు? అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.