మెట్పల్లి మున్సిపల్ ఛైర్మెన్ వైఖరిని నిరసిస్తూ కౌన్సిలర్ల వాకౌట్
సూర్య జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మెట్పల్లి మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం నుంచి అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. చైర్‌పర్సన్ ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్నారని, కౌన్సిల్‌లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిలర్లకు సరైన సమాచారం అందించడం లేదని వారు ఆరోపించారు. తమ వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు వార్డుల అభివృద్ధి విషయంలో తగిన సమాచారం, ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.