మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు
పౌర సరఫరాల మేనేజర్ నివాసంలోనూ తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తులు.. మహబూబాబాద్‌లో ఏసీబీ దాడులు
మహబూబాబాద్ టౌన్ ప్రతినిధి,
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో సీఐ ప్రభాకర్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది. జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు క్యాబిన్‌లోని ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో ఖమ్మంలోని నరసింహారావు నివాసంలో కూడా మరో బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జిల్లా కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన, నివాసంలో ఆస్తుల లెక్కింపు ఒకేసారి కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.