క్రషర్ మిషన్ల దుమ్ముతో పంటలకు నష్టం
రంగారెడ్డి : క్రషర్ మిషన్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో కిష్టాపూర్ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రషర్ మిషన్ల కారణంగా పంట పొలాలు దుమ్ముతో నిండిపోయి పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల మండలం కిష్టాపూర్ గ్రామంలో నెలకొన్న ఈ సమస్యపై గ్రామస్థులు ప్రజాసేవ పార్టీ నాయకులను సంప్రదించడంతో గురువారం పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. రైతులు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
క్రషర్ మిషన్ల నుంచి వెలువడుతున్న దుమ్ము సమీపంలోని చామంతి, టమోటా, బంతి, వరి, పత్తి, కంది పంటలపై పేరుకుపోతోందని రైతులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ పరిసరాల్లోని గడ్డి మొత్తం దుమ్ముతో నిండిపోవడంతో పశువులు మేత మేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. తాగునీటి వనరులు సైతం కలుషితమవుతున్నాయని, దీంతో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రజాసేవ పార్టీ నాయకులు చేవెళ్ల ఆర్డీఓ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధి, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కిష్టాపూర్ పరిసరాల్లోని క్రషర్ మిషన్లను తక్షణమే అక్కడి నుంచి తొలగించాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసేవ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తల్లారం నరసింహ యాదవ్, జనరల్ సెక్రటరీ బింగి రాములు, స్టూడెంట్ అధ్యక్షుడు రమేష్ నాయుడు, రాష్ట్ర నాయకులు సురేష్, ప్రసాద్, గ్రామ రైతులు అంజయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి రంగారెడ్డి, మేజర్ న్యూస్