జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీస్ పేరుతో భారీ మోసం.. ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల వసూలు!
గుంటూరు: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరును అడ్డుపెట్టుకుని భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఘటన మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 7 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అసలేం జరిగింది?
ధరణి అనే వ్యక్తి జనసేన పార్టీ నేతలైన శివ శ్రీనివాస్, కోట రుక్మిణిల పేర్లను, అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తూ ఈ దందాకు తెరలేపాడు. ముఖ్యంగా ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది బాధితుల నుంచి ఉద్యోగాల పేరుతో రూ. 7 కోట్ల మేర నగదు వసూలు చేసినట్లు తెలిసింది.
పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు
తమ పేర్లను వాడుకుని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ధరణి మోసాలకు పాల్పడుతున్న విషయం జనసేన నేతల దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పార్టీ నేతలు వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ధరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, పార్టీ పేరుతో ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జనసేన నేతలు హెచ్చరించారు.