సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు
గ్యాంగ్‌టక్: సిక్కిం-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున సరిగ్గా 4.30 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.
సిక్కింలోని యుక్సోమ్ ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రభావంతో రాజధాని గ్యాంగ్‌టక్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు.