14న హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ, సభ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ!
హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 14న (శనివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు తదితర ప్లాట్‌ఫారమ్ కార్మికులు) భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
శిల్పకళావేదిక నుంచి HICC వరకు భారీ ర్యాలీ
పర్యటనలో భాగంగా మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ఆడిటోరియం నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వరకు గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం HICC వద్ద ఏర్పాటు చేసిన భారీ సభలో గిగ్ వర్కర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించడంతో పాటు, వారితో నేరుగా ముఖాముఖి (Interaction) నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
సంక్షేమ పథకాల ప్రారంభం
భారత్ జోడో యాత్ర సమయంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సభ వేదికగా రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే కీలక నిబంధనలు, సంక్షేమ పథకాలు, అలాగే గిగ్ వర్కర్ల సేవల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇదొక రాజకీయేతర సభ అని, కేవలం గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే పరిశీలించారు.