బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల సెగ!
బాపట్ల, మేజర్ న్యూస్:
బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పులతో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకున్న పలువురు ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఏళ్లుగా పార్టీల కోసం పనిచేసిన నాయకులు పోటీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల కొరత ఏర్పడగా, ఇతర వార్డులకు చెందిన వారిని రంగంలోకి దించాలన్న ప్రయత్నాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ వార్డులకు చెందిన వారికే టికెట్లు ఇవ్వాలని ప్రజలు పట్టుబడుతున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని స్థానికులకే కేటాయించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కూటమి తరఫున చైర్మన్ అవకాశం బీజేపీకి కేటాయించారన్న ప్రచారం, అభ్యర్థి స్థానికతపై చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ వ్యవహారంలో స్థానిక నాయకుల అసంతృప్తి, రాజీనామాకు సిద్ధమన్న ప్రచారం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.