కుక్కల దాడిలో పసిపాప మృతి.. దిందా గ్రామంలో విషాదం!
సూర్య, చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల పరిధిలోని దిందా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గోలక్ష్మి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన పసిపాప కుక్కల దాడిలో మృతిచెందింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో కుక్కలు పసిపాపపై దాడి చేయడాన్ని గమనించారు. వారు అక్కడికి చేరుకునే సమయానికే పాప మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పాప కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు.
అసలు పసిపాపను ఎవరు అక్కడ వదిలివెళ్లారు? ఏ పరిస్థితుల్లో వదిలివెళ్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాలని, పసిపాపను వదిలివెళ్లిన వారి ఆచూకీ గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.